ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్‌కు నమోదు చేసుకునేందుకు చివరి తేదీ అంటూ ప్రచారం జరుగుతుండగా, నమోదు ప్రక్రియ మాత్రం వేగంగా జరగడం లేదు. అధికారులు మాత్రం గడువు ఏదీ లేదని ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీ తరహాలోనే..
ఆరోగ్యశ్రీ పథకం తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ని ర్ణయించింది. దీంతో తెల్ల రేషన్ కార్డుదారుల వివరా లను ఆయుష్మాన్ భారత్‌కు ఆరోగ్యశ్రీ సిబ్బందితో నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ), యూటీఐ కేంద్రాల ద్వారా, ఆరోగ్యమిత్రలతో ఆయుష్మాన్ భారత్‌లో నమోదుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ ప్రక్రియను మొదలుపెట్టినా, ప్రజలకు దీనిపై సరైన అవగాహన కల్పించక పోవడంతో, నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సీఎస్‌సీ కేంద్రాల్లో నమోదుతోపాటు, ఆరోగ్యమిత్రలు ఇంటింటికీ వెళ్లి రేషన్‌కార్డు నంబరును ఆయుష్మాన్ భారత్‌కు అనుసంధానం చేస్తున్నారు.
జిల్లాలో 2,19,453 రేషన్ కార్డులు..
జిల్లాలో 2,19,453 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,48,938 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుండగా, ఇందులో ఇప్పటికి దాదాపుగా 60 వేల కార్డుదారుల వివరాలు మాత్రమే ఆయుష్మాన్ భారత్‌కు అనుసంధానం చేశారు. అనుసంధాన ప్రక్రియ అంతా ఉచితంగానే చేయాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
రేషన్‌కార్డు నంబరుంటే చాలు..
రేషన్‌కార్డుదారులు వారి నంబర్ చెబితే ఆయుష్మాన్ భారత్‌కు అనుసంధానం చేస్తున్నారు. లబ్ధిదారులు వారి రేషన్‌కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబరుతో పాటు, ఏ మొబైల్ నంబర్‌కు అనుసంధానం కలిగి ఉందో ఆ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లాలి. రేషన్‌కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డును ఆయుష్మాన్ భారత్ కోసం ఎంటర్ చేయగానే, ఆధార్‌కార్డు, చిరునామా ఇతర వివరాలన్నీ తెలుస్తాయి. ఇక మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ చెప్పగానే అనుసంధానం చేసే ప్రక్రియను మొదలుపెడతారు. ఇందుకు ఫొటో కూడా తీసుకుని, ఆన్‌లైన్‌లోనే నమోదు చేస్తారు.
1,896 వ్యాధులకు చికిత్స..
ఇక ఆయుష్మాన్ భారత్‌లో 1,896 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వారికి ఏప్రిల్, మే నెలల్లో కార్డులు ఇవ్వనున్నారు.
అందరి వివరాలు నమోదు చేస్తాం
ఆరోగ్యశ్రీ కలిగిన ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులే. అయితే రేషన్‌కార్డు నంబరును చెప్పి, ఆయుష్మాన్ భారత్‌కు అనుసంధానం చేసుకుంటే దేశంలోని ఎక్కడికి వెళ్లినా, ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డు నంబరు ద్వారా ఆరోగ్యమిత్రలు, సీఎస్‌సీ కేంద్రాలలో ఈకేవైసీ అనుసంధానం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు అంటూ ఏమిలేదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అర్హులందరి వివరాలను ఆయుష్మాన్ భారత్‌కు అనుసంధానం చేస్తాం.
- సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ, జిల్లా మేనేజర్
రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం..
తెల్లరేషన్‌కార్డు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరో గ్యశ్రీ సేవలను అందిస్తోంది. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలను అందించే పథకాన్ని ప్రారంభించారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వై ద్యం అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో నూ రూ.5 లక్షల మేరకు ఉచితంగా వైద్య సేవలను ఆరో గ్యశ్రీ అందించే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిస్తారు. ఈ కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలను పొందే అవకాశం ఉంటుంది.
Comments
Post a Comment